మండలం వల్లపురం గ్రామంలో కోతులు వెంటపడటంతో భయంతో పరుగెత్తి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చేపలు పట్టడానికి వెళ్లిన బాలుడిపై కోతుల గుంపు దాడి చేయడంతో ఈ దుర్ఘటన జరిగింది.
వల్లపురం గ్రామానికి చెందిన మోకా వీరబాబు కుమారుడు నిషాంత్ (12, 7వ తరగతి), అదే గ్రామానికి చెందిన దేశగాని సతీష్ కుమారుడు మణేందర్ (11, 6వ తరగతి) ఇద్దరు బాలురు మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో గ్రామంలోని చెరువు వద్దకు చేపలు పట్టడానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఒక్కసారిగా కోతుల గుంపు వీరిపైకి దూసుకువచ్చింది.
కోతులు వెంటపడటంతో భయాందోళనకు గురైన ఇద్దరు బాలురు ప్రాణభయంతో పరుగు తీశారు. ఈ క్రమంలో నిషాంత్ కిందపడిపోగా, కొంత దూరంలో రోడ్డుపై పడిపోయిన మణేందర్ గట్టిగా కేకలు వేశాడు. బాలుడి అరుపులకు కోతులు అక్కడి నుండి వెళ్లిపోయాయి. అనంతరం మణేందర్ వెనక్కి తిరిగి చూడగా నిషాంత్ స్పృహలేకుండా పడిపోయి ఉన్నాడు.
సత్వర స్పందన
అదే సమయంలో అటుగా వెళ్తున్న అదే గ్రామానికి చెందిన మల్లం నరేందర్, కటికోల కార్తీక్ అనే యువకులు గమనించి, వెంటనే నిషాంత్‌ను తమ బైక్‌పై స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. అయితే అక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో, వారు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు నిషాంత్‌ను ఒక చార్జింగ్ ఆటోలోకి ఎక్కించారు.
ఆటో చాలా నిమ్మదిగా వెళ్తుండటంతో సమయం వృథా కాకూడదని భావించిన నరేందర్, కార్తీక్ తిరిగి బాలుడిని తమ బైక్‌పైనే కూర్చోబెట్టుకొని ఖమ్మం వైపు వేగంగా తీసుకెళ్లారు. పెరిక సింగారం బ్రిడ్జి వద్దకు చేరుకోగానే వీరు పిలిపించిన 108 అంబులెన్స్ ఎదురుగా వచ్చింది. వెంటనే బాలుడిని అంబులెన్స్‌లోకి షిఫ్ట్ చేసి పరీక్షించిన సిబ్బంది, నిషాంత్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ ఘటనతో వల్లపురం గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.












