రాయికల్ మండలం ఆలూరులోని పంట చేలను, కూరగాయల తోటలను, మామిడి తోటలను పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పరిశీలించారు. వరి, మిర్చి, మామిడి పంటల్లో తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు వారు సూచనలు అందించారు.
జగిత్యాల మండలం పరిధిలోని పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం దత్తత గ్రామం రాయికల్ మండలం ఆలూరులోని పంట చేలను, కూరగాయల తోటలను, మామిడి తోటలను పొలాస శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా వరిలో అగ్గి తెగులు నివారణకు టేబుకోనాజోలు ట్రైప్లాక్సిస్త్రోబిన్ 80 గ్రాములు ఎకరానికి పిచికారీ చేయాలని సూచించారు. కూరగాయలు, మిర్చిలో కొమ్మవిరుపు తెగుల నివారణకు అజాక్సిస్ట్రోబిన్ డైఫెనకోనాజోలు 200 మి.లీ, త్రిప్స్ నివారణకు సైయంట్రానిలిప్రోలు 300 మి.లీ ఎకరానికి పిచికారీ చేయాలని సూచించారు. వాతావరణంలో ఎండ, మంచు వలన వచ్చే సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను కీటక శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి వివరించారు. మామిడి తోటల్లో తేనెమంచు తెగులు నివారణకు ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి ముందస్తు చర్యలను సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు సర్పంచ్ నల్లాల స్వామి, పాక్స్ చైర్మన్ దీటి రాజారెడ్డి, రైతులు మెక్కొండ రాంరెడ్డి, ఎలిపెద్ది రాజు, నల్లాల తిరుపతి, సతీష్, మల్లారెడ్డి, పెద్ద సాయన్న, గంగవ్వ, లావణ్యలు పాల్గొన్నారు.












