మండలంలోని జోగంపల్లి చలివాగు ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోజుకూ తగ్గిపోతుండటంతో స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో కనీసం 17 అడుగుల నీటిమట్టం కొనసాగించాల్సి ఉన్నప్పటికీ, పంప్‌హౌస్ అధికారులు మోటార్లను నడుపుతూ నీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని సర్పంచ్ మారబోయిన ప్రభాకర్ ఆరోపించారు.
మంగళవారం రైతులతో కలిసి చలివాగు ప్రాజెక్టును సందర్శించిన సర్పంచ్ మారబోయిన ప్రభాకర్, ప్రాజెక్టులో 17 అడుగుల నీటిని నిల్వ ఉంచిన అనంతరం అదనంగా వచ్చే నీటిని మాత్రమే ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుందని తెలిపారు. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయి, నీరు అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆదేశాల మేరకు పలుమార్లు పంప్‌హౌస్‌ను బంద్ చేయించినప్పటికీ, అధికారులు మళ్లీ మోటార్లు నడుపుతూ నీటిని తరలిస్తున్నారని సర్పంచ్ ఆరోపించారు. ఎమ్మెల్యే సూచనలు చేసినప్పటికీ, ఆయన మాటను లెక్కచేయకుండా సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
చలివాగు ప్రాజెక్టు నీటిపై ఆధారపడే రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే నీటి తరలింపును నియంత్రించాలని సర్పంచ్, రైతులు డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో తప్పనిసరిగా 17 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగించి, అదనపు నీటిని మాత్రమే ఇతర ప్రాంతాలకు తరలించాలని కోరారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు లక్కం రాంబాబు, కవటం ప్రభాకర్, నరసయ్య, కర్ణాకర్, స్వర్గం ప్రభాకర్, రవి, సదానందం, బిక్షపతి నరేష్, వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.












