ప్రభుత్వ పింఛన్ పొందాలనే దురుద్దేశంతో బతికున్న తన భర్త చనిపోయినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించిన మహిళ వ్యవహారం విజయవాడలో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మహిళతో పాటు, లంచం తీసుకుని నకిలీ ధ్రువీకరణ పత్రం జారీ చేసిన శానిటరీ ఇన్స్పెక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ కానూరు గ్రామ పంచాయతీ ఆఫీస్ రోడ్డులో నివాసం ఉంటున్న యర్రంశెట్టి రమాదేవి (1), తన భర్త మురళీకృష్ణతో విభేదాల కారణంగా గత 15 ఏళ్లుగా విడిగా ఉంటోంది. ఇటీవల ప్రభుత్వం కొత్త పింఛన్లకు దరఖాస్తులు కోరడంతో, పింఛన్ పొందేందుకు తన భర్త చనిపోయినట్లుగా చూపించాలని ఆమె పథకం వేసుకుంది.
ఈ క్రమంలో, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్ దారా ఆంటోనీ (2)ను రమాదేవి సంప్రదించింది. ఆమె నుంచి రూ.15 వేల లంచం తీసుకున్న ఆంటోనీ, మురళీకృష్ణ చనిపోయినట్లుగా నకిలీ బరియల్/క్రిమేషన్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆ నకిలీ సర్టిఫికెట్ ఆధారంగా రమాదేవి తాడిగడప మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకుంది. అధికారులను నమ్మించి, డెత్ సర్టిఫికెట్ కూడా పొందింది. దీంతో ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి రావడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.








