జగిత్యాల, 7 September
ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించనుంది. ఇప్పటికే రూ.117 కోట్లు మంజూరు చేయగా, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు మరో రూ.80 కోట్లు కూడా మంజూరు చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నిధులతో ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.
ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.117 కోట్లు మంజూరు చేసిందని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు మరో రూ.80 కోట్లు కూడా మంజూరు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దాదాపు రూ.200 కోట్లతో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ధర్మపురిలోని లక్ష్మీనరసింహ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు ధర్మపురి కి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రేపటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ధర్మపురికి రావడంలో సుమారు ఐదు గంటలు ఆలస్యమైందని, అయినప్పటికీ ప్రజలు, కార్యకర్తలు ఎంతో ప్రేమాభిమానాలతో తనకు స్వాగతం పలకడం సంతోషంగా ఉందన్నారు. ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణలు చెబుతూ, ప్రజలు చూపిన ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రాధాన్యత, ధర్మపురి క్షేత్ర వైభవం అందరికీ తెలుసునని అన్నారు. గతంలో పలువురు నాయకులు ఆలయ అభివృద్ధిపై ఎన్నో హామీలు ఇచ్చినా అవి అమలుకు నోచుకోలేదన్నారు. ప్రజల ప్రభుత్వం ధర్మపురి ఆలయ అభివృద్ధికి రూ.117 కోట్లు మంజూరు చేసిందని, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరిన మేరకు మరో రూ.80 కోట్లు కూడా మంజూరు చేస్తామని ప్రకటించారు.
దాదాపు రూ.200 కోట్లతో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని, క్షేత్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యాలు, ఆలయ వైభవం, మౌలిక వసతులను మెరుగుపరుస్తామని చెప్పారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి సద్వినియోగం కావాలని, ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరేలా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.
గత పదేళ్లలో ప్రజలు స్వేచ్ఛ లేకుండా భయంతో జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఉప ముఖ్యమంత్రి విమర్శించారు. ఒక కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని, తాను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అనేక అవమానాలు ఎదుర్కొన్నానని గుర్తుచేశారు. ప్రజల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్వహించిన ప్రజల మార్చ్, పాదయాత్రలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనతో కలిసి పాల్గొన్నారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఒక్కో స్కూలుకు 200 కోట్ల నిధులతో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేశామని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభించామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు. 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 16 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని తెలిపారు. ప్రతి రేషన్ కార్డు దారుడికి సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు.












