పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ అకారణంగా అరెస్టు చేస్తే చర్యలు తప్పవని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయకుండా ఒక వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసు అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్టుకు సంబంధించిన కారణాలను లిఖితపూర్వకంగా అందించనప్పుడు, ఆ అరెస్టు చట్టవిరుద్ధమేనని జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్. చందుర్కర్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) పార్టీ ములన్పూర్ దాఖా నియోజకవర్గ ఇన్ఛార్జ్ జస్కరణ్జీత్ సింగ్ అరెస్టును ధర్మాసనం చట్టవిరుద్ధంగా ప్రకటించింది. ఒక మైనర్పై లైంగిక దాడికి సంబంధించిన ఆరోపణల కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. అరెస్టు కారణాలను ఆయనకు లిఖితపూర్వకంగా అందజేయలేదన్న కారణంతో స్థానిక కోర్టు ఆ అరెస్టును చట్టవిరుద్ధమని ప్రకటించి, వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అయితే, పంజాబ్-హరియాణా హైకోర్టు ఆ ఉత్తర్వుపై స్టే విధించడంతో సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రాజ్యాంగ ప్రాధాన్యత
ఈ తీర్పును వెలువరిస్తూ, జస్టిస్ భుయాన్, ఆర్టికల్ 22లోని (1), (2) క్లాజులు రెండింటినీ ఉల్లంఘించి అరెస్టయిన నిందితుడిని మళ్లీ అరెస్టు చేయవచ్చా, చేయవచ్చంటే ఏ పరిస్థితుల్లో, ఏ పద్ధతిలో, ఏ విధానం పాటించాలి అనేది ఈ అప్పీలు లేవనెత్తిన విస్తృత రాజ్యాంగ ప్రాధాన్యం గల ప్రశ్న అని పేర్కొన్నారు. గతంలో వెలువడిన శ్రీ దర్శన్, సోనమ్ రఘువంశీ కేసుల తీర్పులు భిన్నంగా కనిపించినా, వాటిపై చర్చ అనవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది.












