భారతదేశంలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు పెరగకపోవడంతో నిరుద్యోగం తాండవిస్తోంది. ఇది నేరాలు, ఆత్మహత్యలు, కుటుంబ కలహాలకు దారితీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నా, ప్రజలకే ఉపాధి కరువవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో ఉద్యోగాలు లభించక ఎంతోమంది యువకులు కుటుంబాలను విడిచి గల్ఫ్ దేశాలకు వలస బాట పడుతున్నారు. అక్కడ పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇక దేశంలోనే ఉండిపోయిన నిరుద్యోగులు తక్షణమే డబ్బు సంపాదించాలనే దురాశతో లేదా కుటుంబ పోషణ భారమై దొంగతనాలు నేరాల బాట పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తారస్థాయికి చేరడంతో కన్నతల్లిదండ్రులకు మందులకు డబ్బులు ఇవ్వలేక వారిని కడతేరుస్తున్న దారుణాలను, భార్యాభర్తల మధ్య ఆర్థిక సమస్యల కారణంగా హత్యలు జరుగుతున్న వార్తలను నేడు నిత్యం చూస్తున్నాం. బతకలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగుల సంఖ్య కూడా పెరుగుతోంది.
కొంతమంది మత పెద్దలు జనాభాను పెంచాలని పిలుపునిస్తుండడం గమనార్హం. కానీ, ఆ విధంగా పెరిగే జనాభాకు పూటకూడు, విద్య, వైద్యం మరియు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఎవరిది పుట్టించిన పిల్లలను ఎలా పెంచాలి వారికి ఉపాధి చూపకుండా కేవలం జనాభాను పెంచమనే వారిదే బాధ్యత కాదా అనే ప్రశ్నలకు నేటికీ సమాధానం కరువైంది. ప్రజల సంక్షేమం కోసం పాటుపడాల్సిన ప్రజాప్రతినిధులు ఆ బాధ్యతను విస్మరించారు. నేడు నాయకులు ప్రజలకు మేలు చేసే విధానాల గురించి ఆలోచించడం మానేసి, కేవలం వ్యక్తిగత విమర్శలు రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన కలిగిన నాయకులు ఈ రోజుల్లో అరుదుగా మారిపోయారు.
దేశంలో కఠినమైన చట్టాలు రాజ్యాంగం ఉన్నప్పటికీ ఈ ఆర్థిక అసమానతలను మరణ హోమాలను అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. కేవలం వ్యక్తులు చేసే తప్పులనే కాకుండా, వారికి ఉపాధి కల్పించడంలో విఫలమైన వ్యవస్థల వైఫల్యామే దీనికి మూల కారణం. నిరుద్యోగంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఉపాధి కల్పించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. బాధ్యులైన ప్రభుత్వాలపై విమర్శలు రాకుండా ఉండేందుకు కొన్నిసార్లు ఇలాంటి వార్తలను సమాజం దృష్టికి రాకుండా తొక్కిపెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. నిరుద్యోగం వల్ల తప్పుదారి పడుతున్న పౌరులను కేవలం నేరస్తులుగా మాత్రమే చూడలేం. అది వ్యవస్థ చేసిన మోసానికి, ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనం. రాజ్యాంగబద్ధమైన హక్కులను ఉపయోగించుకుంటున్న పౌరులకు, కనీస జీవనాధారమైన ఉపాధిని కల్పించి, ఆత్మహత్యారహిత సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత పూర్తిగా పాలకులదే.












