మధిర, 2026-11-18
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం జీవో నెంబర్ 25ను సవరించి, 40 మందికి పైగా విద్యార్థులు ఉన్న ప్రతి ప్రాథమిక పాఠశాలకు తరగతికోక ఉపాధ్యాయుణ్ణి కేటాయించాలని ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్, జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేట్ యాజమాన్యాల రూపంలో రోజుకో కొత్త పేరుతో తెరపైకి వస్తున్న పాఠశాలలకు బదులుగా, ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన విద్యా విధానాన్ని ప్రకటించి అమలుపరచాలని వారు కోరారు. ఇటీవల ముగిసిన టీఎస్ యుటిఎఫ్ జిల్లా మహాసభల్లో ఈ దిశగా పలు తీర్మానాలను ఆమోదించినట్లు తెలిపారు.
ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం
స్థానిక ప్రాంతీయ కార్యాలయం, మధిర నందు మండల అధ్యక్షుడు బి నాగరాజు అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలైన పర్యవేక్షణ అధికారుల నియామకానికి సర్వీస్ రూల్స్ రూపకల్పన, ఉద్యోగుల హెల్త్ కార్డు పూర్తిస్థాయి అమలుకై సమగ్ర విధానం, పీఆర్సీ సాధన, సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏల విడుదల, పెండింగ్ బిల్లుల జమ, ఎంజేపీ గురుకులాల టైం టేబుల్ మార్పు వంటి సమస్యల సాధన దిశగా రాబోయే రోజుల్లో పోరాటాలకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో పాల్గొన్నవారు
ఈ సమావేశంలో ప్రాంతీయ కార్యాలయం కన్వీనర్ ఏ వినోద రావు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు మహమ్మద్ రఫీ, మధిర మండల ప్రధాన కార్యదర్శి ఈ.వీరయ్య, మండల ఉపాధ్యక్షులు పటాన్ బాజిఖాన్, కోశాధికారి బి చెన్నయ్య, కార్యదర్శులు బొబ్బిళ్ళ పాటి రమేష్ బాబు, డి మహేంద్ర కుమార్, లంక నాగేశ్వరరావు, పోతినేని రాజేష్, నిమ్మగడ్డ గోపీచంద్, రెడ్డి గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.







