సంబంధిత (ధర్మ రథం) అక్టోబర్ 04
ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్యాస్ సిలిండర్లపై 300 సబ్సిడీని 2026-27 ఆర్థిక సంవత్సరానికి కూడా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, క్షేత్రస్థాయిలో కొందరు గ్యాస్ డీలర్లు డెలివరీ పేరుతో సామాన్యులను దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆర్థిక ఊరటనిచ్చింది. పేద, మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్యం, ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గ్యాస్ సిలిండర్లపై 300 సబ్సిడీని 2026-27 ఆర్థిక సంవత్సరానికి కూడా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 5 కిలోల చిన్న సిలిండర్లకు కూడా దామాషా పద్ధతిలో సబ్సిడీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
2016లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10.57 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించారు. ఉచిత గ్యాస్ స్టవ్, మొదటి సిలిండర్‌తో పాటు తదుపరి రీఫిలింగ్స్పై 300 సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతోంది. తాజాగా మరో 25 లక్షల కొత్త కనెక్షన్లు మంజూరు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
డీలర్ల బాహాటపు దోపిడీ లబ్ధిదారుల ఆవేదన
ప్రభుత్వం పథకాన్ని విస్తరిస్తుంటే, క్షేత్రస్థాయిలో కొందరు గ్యాస్ డీలర్లు సబ్సిడీని, వినియోగదారుల సొమ్మును నొక్కేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. కొన్ని జిల్లాల్లోని మండలాల్లో లబ్ధిదారులకు పొంతన లేని కారణాలు చెబుతూ, మీకు ఎలాంటి సబ్సిడీ రావడం లేదు అని నమ్మిస్తున్నారు.
అదనపు వసూళ్లు
సిలిండర్ ఇంటికి తెచ్చినందుకు నియమ నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ డెలివరీ సిబ్బంది ప్రతి సిలిండర్‌పై రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
సిబ్బంది జీతాల్లో కోత ప్రజలపై భారం
గ్యాస్ ఏజెన్సీ డీలర్లు తమ వద్ద పనిచేసే డ్రైవర్లు, లేబర్లకు నెలకు కేవలం 2,000 మాత్రమే జీతంగా ఇస్తూ, మిగిలిన డబ్బులను ప్రజల వద్ద నుంచే అదనంగా వసూలు చేసుకోండి అని బాహాటంగా చెబుతున్నారు.
అదనపు చార్జీలపై ప్రశ్నించిన వినియోగదారులను ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ డీలర్లు, డెలివరీ సిబ్బంది భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే సబ్సిడీ జమ చేస్తున్నప్పటికీ, అవగాహన రాహిత్యాన్ని ఆసరాగా చేసుకుని డీలర్లు సాగిస్తున్న ఈ దందాపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా అదనపు చార్జీలు వసూలు చేస్తున్న గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులను రద్దు చేయాలని, లబ్ధిదారులను పీడించే డీలర్లపై పౌరసరఫరాల శాఖ, వినియోగదారుల వ్యవహారాల శాఖ అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.












