వరి పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, తక్కువ వోల్టేజీ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అన్నదాతల పంటలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. రైతులకు నిరంతరాయంగా, తగిన వోల్టేజీతో విద్యుత్ సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మరో నాలుగు రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే షాద్‌నగర్ నియోజకవర్గంలోని విద్యుత్ సబ్స్టేషన్లను ముట్టడించి ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. రైతుల విజ్ఞప్తి మేరకు కేశంపేట్ కేశంపేట్ మండలంలోని కొత్తపేట, సంతపూర్, నిర్దేవెల్లి గ్రామాల్లో వరి పంటలను పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలోని బీజేపీ నాయకుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సాగునీటి సమస్యలు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలపై వివరాలు తెలుసుకున్నారు.
నాయకులు తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 100 ఎకరాల్లో పరిశీలించిన వరి పంటల్లో దాదాపు 50 ఎకరాలకు మాత్రమే కొంతమేర నీరు అందుబాటులో ఉండగా, మిగిలిన 50 ఎకరాల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. వీటిలో సుమారు 15 ఎకరాల వరి పంట ఇప్పటికే ఎండిపోయే దశకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 15 నుంచి 20 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పెట్టుబడుల కోసం అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతులు, పంట చేతికొచ్చే సమయంలో నీరు అందక నష్టపోవాల్సి వస్తే వారి పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని పేర్కొన్నారు. వ్యవసాయానికి కేటాయించిన విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని రైతులు బీజేపీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ సరఫరా మధ్యమధ్యలో నిలిచిపోవడం, తక్కువ వోల్టేజీ కారణంగా మోటార్లు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల పొలాలకు తగినంత నీరు అందడం లేదని వాపోయారు.
ప్రభుత్వం వ్యవసాయానికి కేటాయించిన విద్యుత్ వేళల్లోనైనా నిరంతరాయంగా, తగిన వోల్టేజీతో సరఫరా చేస్తే పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమలకు తాత్కాలికంగా కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరాను తగ్గించి, ఆ విద్యుత్‌ను వ్యవసాయ అవసరాలకు మళ్లించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాలని డిమాండ్ చేశారు.
పరిశ్రమల అవసరాలతో పాటు రైతుల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. వరి పంటలు కీలక దశలో ఉన్న సమయంలో విద్యుత్ సమస్యలతో రైతులు నష్టపోవడం ఆందోళనకరమని అన్నారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు.
విద్యుత్ సరఫరా సమస్యపై ఎమ్మెల్యే, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు మరో నాలుగు రోజుల గడువు ఇస్తున్నామని, ఈలోగా సమస్య పరిష్కారం కాకపోతే షాద్‌నగర్ నియోజకవర్గంలోని విద్యుత్ సబ్స్టేషన్లను ముట్టడించి రైతుల పక్షాన ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎండిపోయే దశలో ఉన్న వరి పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు సాగునీరు అందించడం, పంట నష్టాన్ని నివారించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ వారి పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో బీజేపీ షాద్‌నగర్ నియోజకవర్గ ధార్మిక సెల్ కన్వీనర్ పసుల నరసింహ యాదవ్, రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు కంచుకోట మహేష్, సీనియర్ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి, సిల్వర్ లింగయ్య, వేణుగోపాల్, ఆకుల గోపాల్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంత్, సాయి, సత్యం, మహాలింగం, అమర్నాథ్ రెడ్డి, దామోదర్ రెడ్డి, మురళి, శ్రీశైలం, హరికృష్ణ, బీరస్వామి, ఎల్లయ్య, కుమ్మరి వెంకటేష్, యాదగిరి, శేఖర్ రెడ్డి, కృష్ణయ్య, లింగయ్య, సత్యనారాయణ, శేఖర్ తదితరులతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.












