జగిత్యాల గ్రామీణ, 13 November
బాలల దినోత్సవం సందర్భంగా జగిత్యాల మండలం అంతర్గామ ఉన్నత పాఠశాలలో స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి, తోటి విద్యార్థులకు పాఠాలు బోధించడం, క్రమశిక్షణ నేర్పడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ఈ కొత్త అనుభవాన్ని విద్యార్థులందరూ ఆనందంగా స్వీకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరూ తాము భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా స్థిరపడతామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సింగు సత్తయ్య మాట్లాడుతూ, భవిష్యత్తులో పిల్లలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉన్నత స్థానాల్లో రాణించాలని, మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని కుటుంబానికి, గ్రామానికి గౌరవం తీసుకురావాలని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు చీటి భూపతిరావు, బాలె సరోజ, ఎర్రోజు అనిత, మాడ రజనీకర్ రెడ్డి, భోగ రాజేందర్, వ్యాయామ ఉపాధ్యాయులు కొండ పలుకుల కోటేశ్వరరావు, లలిత పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ ప్రోత్సాహక బహుమతులను ప్రధానోపాధ్యాయులు సింగు సత్తయ్య అందజేశారు.







