హనుమకొండ, 2026-06-05
వరంగల్ మహానగర పరిధిలోని క్రైస్తవ మత పెద్దలతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మత సామరస్యమే ప్రజా పాలనకు బలం అని, అన్ని మతాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. క్రైస్తవ సోదరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
వరంగల్ మహానగర పరిధిలోని కాజీపేట, హనుమకొండ, వరంగల్ ప్రాంతాలకు చెందిన క్రైస్తవ మత గురువులు, మత పెద్దలతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పూర్తి స్నేహపూర్వక వాతావరణంలో, రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ సమావేశంలో క్రైస్తవ సమాజానికి సంబంధించిన పలు అంశాలపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వారితో సుదీర్ఘంగా చర్చించారు. మత సామరస్యమే ప్రజా పాలనకు బలం అని, అన్ని మతాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
అన్ని మతాల గౌరవమే విధానం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ మహానగరం అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవించే నగరమని అన్నారు. ప్రతి ఒక్కరి మత విశ్వాసాలను, ఆచారాలను, సిద్ధాంతాలను గౌరవిస్తూ ముందుకు సాగడమే తన రాజకీయ, ప్రజా జీవిత విధానమని స్పష్టం చేశారు. ప్రజల మధ్య మత సామరస్యాన్ని, సోదరభావాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకుంటూ, పరస్పర సహకారంతో ముందుకు సాగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
సమస్యల పరిష్కారానికి హామీ
క్రైస్తవ మత గురువులు, మత పెద్దలతో నిర్వహించిన ఈ సమావేశం పూర్తిగా రాజకీయాలకు అతీతంగా స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగిందని ఎమ్మెల్యే తెలిపారు. క్రైస్తవ సోదరులతో తనకు ఎప్పటి నుంచో ఆత్మీయ సంబంధాలు ఉన్నాయని, వారి సమస్యలను తన సమస్యలుగానే భావించి పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. క్రైస్తవ సమాజానికి అవసరమైన మౌలిక వసతులు, ప్రార్థనా మందిరాలు, శ్మశాన వాటికలు, సామాజిక అవసరాలకు సంబంధించిన సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటిపై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా
స్థానికంగా పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని నాయిని రాజేందర్ రెడ్డి గారు తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో క్రైస్తవ సోదరుల అవసరాల కోసం మూడెకరాల స్థలాన్ని కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు గుర్తు చేశారు. క్రైస్తవ సమాజానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఈ స్థల కేటాయింపు జరిగిందని తెలిపారు. భవిష్యత్లో కూడా క్రైస్తవ సోదరుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పరంగా సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.












