సూర్యాపేట, 2026-11-29
విద్యార్థుల నుంచి ఉపాధ్యాయులకు రక్షణ కల్పించే చట్టం తక్షణమే తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిలర్ చారగుండ్ల కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిలర్ సూర్యాపేట జిల్లాకు చెందిన చారగుండ్ల కృష్ణ, నడిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని కోరింది. పురాణాలలో గురువును బ్రహ్మతో సమానంగా కొనియాడారని, నేడు విద్యాసంస్థలలో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన అలవాట్లను పెంపొందిస్తూ, వారి విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
కొన్ని సందర్భాలలో విద్యార్థులను మందలించవలసి వస్తుంది. సినిమాలు, మొబైల్స్, టీవీ సీరియల్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల ప్రభావంతో విద్యార్థులలో క్రూరత్వం పెరిగి, ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల నల్గొండ జిల్లా కొండా మల్లేపల్లిలోని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధారెడ్డిపై అదే పాఠశాలకు చెందిన ఇద్దరు 10వ తరగతి విద్యార్థులు, అలాగే నెలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న లైబ్రేరియన్ కం లెక్చరర్ మేకల గోపాలకృష్ణపై అదే కళాశాలకు చెందిన ఒక విద్యార్థి దాడి చేశారు. ఈ ఘటనలో గోపాలకృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
విద్యాసంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులకు, సిబ్బందికి రక్షణ కరువైందని, కావున ప్రభుత్వం వెంటనే స్పందించి, ఉపాధ్యాయుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రభుత్వాన్ని కోరారు.







