గద్వాల, జూలై 28
గద్వాల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థి, మహిళా లెక్చరర్ వేధింపులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. చదువులో ప్రతిభావంతుడైన తరుణ్ (17)ను తోటి విద్యార్థితో మార్కులు పోల్చి, అందరి ముందు అవమానించడంతో ఈ దారుణం జరిగింది.
తోటి విద్యార్థితో మార్కులను పోల్చి, అందరి ముందూ లెక్చరర్ అవమానించడంతో మనస్తాపం చెంది ఓ ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన జోగులాంబ గద్వాల ప్రభుత్వ కళాశాల పరిధిలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గద్వాల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతిబొట్టు తరుణ్ (17) చదువులో ప్రతిభావంతుడు. గతంలో జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 434 మార్కులు సాధించి జిల్లాలోనే రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
అయితే, ఇటీవల కాలేజీలో 435 మార్కులు సాధించిన మరో విద్యార్థితో తరుణ్‌ను పోల్చుతూ ఓ మహిళా లెక్చరర్ తరగతి గదిలో తీవ్రంగా కించపరిచింది. "434 మార్కులు వస్తే నువ్వేమన్నా గొప్పోడివా? నీకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారు కూడా ఉన్నారు" అంటూ అందరి ముందూ హేళన చేసింది.
లెక్చరర్ మాటలపై మనస్తాపం చెందిన తరుణ్, అలా బహిరంగంగా అవమానపరచడం సరైంది కాదని విజ్ఞప్తి చేశాడు. అయినప్పటికీ శాంతించని ఆ లెక్చరర్, "నువ్వేమైనా మంత్రి కొడుకువా, అంతకంటే గొప్పోడివా?" అంటూ తరుణ్ చెంపపై కొట్టి మరింతగా అవమానించింది. లెక్చరర్ ప్రవర్తన చూసి క్లాస్‌లోని మిగతా విద్యార్థులందరూ నవ్వడంతో తరుణ్ తీవ్ర ఆవేదనకు, మనోవేదనకు గురయ్యాడు.
ఈ అవమానాన్ని భరించలేక మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఉండాలి కానీ ఇలా అవమానించకూడదు. ఒక్క సున్నిత మనస్కుడికి అవమానం జరిగితే ఎంత బాధపడతాడో ఆ లెక్చరర్‌కు తెలియాలి.
అంటూ తరుణ్ తన ఆఖరి లేఖలో రాసిన ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో చదువుకుంటున్న ఒక ప్రతిభావంతుడైన విద్యార్థి ఉపాధ్యాయుల నిర్లక్ష్యపు ధోరణికి బలైపోవడం పట్ల విద్యార్థి సంఘాలు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆ లెక్చరర్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.












