మేడ్చల్-మల్కాజిగిరి (ధర్మ రథం) సెప్టెంబర్ 17
జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి అవినీతి నిరోధక శాఖ () దాడులు కలకలం రేపాయి. ఒక కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేయడానికి సీఐ ఆంజనేయులు రూ.10 లక్షలు డిమాండ్ చేయగా, రూ.5 లక్షల తొలి విడతను స్వీకరిస్తున్న ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన దాడులు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఒక కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేయడానికి సీఐ ఆంజనేయులు ఏకంగా రూ.10 లక్షల లంచం డిమాండ్ చేశారు.
అంతటితో ఆగకుండా బాధితుడితో సొంత పనులు చేయించుకోవడమే కాకుండా, కొన్నిరోజులుగా బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ వంటివి తెప్పించుకుంటూ తీవ్ర వేధింపులకు గురిచేశారు. ఈ వేధింపులను తట్టుకోలేకపోయిన బాధితుడు చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో అధికారులు వ్యూహాత్మకంగా రంగంలోకి దిగారు. సీఐ సూచన మేరకు బాధితుడి నుంచి రూ.5 లక్షల తొలి విడత లంచం సొమ్మును కీసర చెరువుగట్టు వద్ద నిమజ్జనం డ్యూటీలో ఉన్న ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు.
అధికారులను చూసి ఎస్సై అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించడమే కాక, కెమికల్ టెస్టులకు సహకరించకుండా ఇబ్బందులు పెట్టాడు. చివరకు ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డితో పాటు లంచం డిమాండ్ చేసిన సీఐ ఆంజనేయులును కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.











