రాజన్న సిరిసిల్ల, 2026-11-01
సిరిసిల్లలోని చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భగవద్గీత పోటీలు విజయవంతంగా నిర్వహించారు. భక్తి యోగం శ్లోకాల పఠనంలో ప్రతిభ కనబరిచిన 15 మంది విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన వారికి ప్రోత్సాహం అందించారు.
సిరిసిల్లలోని చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే భగవద్గీత పోటీలు 2026 సంవత్సరానికి గాను విద్యార్థులకు భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం శ్లోకాల పఠనం నేర్పించి, పోటీలు నిర్వహించింది. శ్రీ సరస్వతి శిశు మందిర్, గాంధీనగర్, సిరిసిల్ల విద్యార్థులు 137 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. వివిధ గ్రూపులుగా విభజించి నిర్వహించిన ఈ పోటీలో 15 మంది విద్యార్థులు బహుమతులకు ఎంపికయ్యారు. ప్రతి గ్రూపులో ప్రథమ బహుమతి పొందిన వారిని ఎంపిక చేసి, ఐదుగురిని జిల్లా స్థాయి పోటీలకు పంపించారు. వీరిలో మూడవ తరగతి విద్యార్థి మ్యాన శ్రీ వర్ధన్ యూకేజీ విభాగంలో జిల్లా స్థాయిలో బహుమతి గెలుచుకున్నారు. అంతేకాకుండా, మూడవ తరగతి విద్యార్థి దూస రుత్విక్ కడపలో నిర్వహించబడే రాష్ట్రస్థాయి పోటీకి ఎంపికయ్యాడు. ఈ పోటీలో గెలుపొందిన బాలబాలికలందరికీ బహుమతులు, ప్రశంసా పత్రాలు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు, జ్ఞాపికలు, నగదు పురస్కారాలు అందించారు. సహృదయులు, ఆత్మీయులైన శ్రీ రుద్ర జయ రాజేంద్రప్రసాద్ దంపతులు బహుమతులు వితరణ చేశారు. ఇలాంటి పోటీలు భవిష్యత్తులో కూడా నిర్వహించడానికి అవకాశం కల్పించాలని చిన్మయ మిషన్ ప్రధాన కార్యదర్శి, బాలవిహార్ ఆచార్యులు శ్రీ నల్ల సత్యనారాయణ కోరారు. బహుమతులు అందించిన దంపతులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ కోశాధికారి శ్రీ మేరుగు మల్లేశం, కార్యదర్శి వెంగళ కమలాకర్, కార్యవర్గ సభ్యులు జక్కని రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.












