ఖమ్మం, 23 September
భద్రాచలం పట్టణ పరిధిలోని ఇసుక ర్యాంపు సమీపంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 3.5 కేజీల ఎండు గంజాయితో పాటు రూ. 2.80 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
భద్రాచలం పట్టణ పరిధిలోని ఇసుక ర్యాంపు సమీపంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్.కిషన్ ఆదేశాల మేరకు, ఎన్ఫోర్స్మెంట్ సీఐ ఎన్. నరేందర్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్ఐ సిహెచ్. హరిరావు తన సిబ్బందితో కలిసి బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల సమయంలో అటుగా వస్తున్న ఒక యమహా బైక్‌ను ఆపి తనిఖీ చేయగా, అందులో 3.5 కేజీల నిషేధిత ఎండు గంజాయి లభించింది. అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితులను స్థానిక ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారించారు. విచారణలో తేలిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన మాస్క్ మున్నా, జున్ను శ్రీనివాస్‌లు ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి ప్రాంతం నుంచి గంజాయిని సేకరించి ఘట్కేసర్కు తరలిస్తున్నట్లు గుర్తించారు. భద్రాచలం వద్ద తనిఖీలు జరుగుతుండగా వీరు పోలీసులకు చిక్కారు.
నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 3.5 కేజీల ఎండు గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లు, యమహా బైక్‌ను సీజ్ చేశారు. పట్టుబడిన సొత్తు విలువ సుమారు రూ. 2.80 లక్షలు ఉంటుందని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ట్రైనింగ్ ఎస్సైలు సందీప్, పృథ్వి, కానిస్టేబుల్స్ వీరబాబు, ప్రసన్న కుమార్, డ్రైవర్ సాయిలు పాల్గొన్నారు.











