మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల లభ్యత, రోగులకు అందుతున్న వైద్య సేవల తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవసరమైన సమయంలో మందులు అందుబాటులో ఉండటం లేదని, బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. గడువు ముగిసే మందులు సరఫరా అవుతున్నాయని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతిరోజూ అనేక మంది వైద్యం కోసం వస్తుంటారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారం. అయితే, ఆసుపత్రిలో మందుల లభ్యత, రోగులకు అందుతున్న వైద్య సేవల తీరుపై కొందరు రోగులు, వారి బంధువులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
అవసరమైన సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు అందుబాటులో లేకపోవడం, బయట మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి రావడం వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని రోగులు చెబుతున్నారు. మరోవైపు, 2024లో సరఫరా అయిన కొన్ని మందులు గడువు ముగియడానికి కొద్దికాలం మాత్రమే మిగిలి ఉండగా, అప్పుడు బయటకు వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మందుల నిల్వలు, సరఫరా తేదీలు, గడువు తేదీలు, పంపిణీ రికార్డులపై సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అవసరమైనప్పుడు మందులు ఎందుకు ఉండవు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే, రోగులకు అవసరమైన సమయంలో మందులు అందుబాటులో లేకపోతే.. వాటి నిల్వలు ఎప్పుడు వచ్చాయి ఎంత పరిమాణంలో వచ్చాయి ఎప్పుడు పంపిణీ చేశారు గడువు తేదీలను సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మందులు రోగుల ప్రాణాలతో ముడిపడి ఉన్నందున, గడువు తేదీని ప్రతి రోగి తప్పనిసరిగా పరిశీలించాలి. వైద్యులు, ఫార్మసీ సిబ్బంది కూడా మందులు అందించే సమయంలో గడువు తేదీ, నిల్వ పరిస్థితులను నిర్ధారించాల్సిన బాధ్యత ఉందని ప్రజలు గుర్తుచేస్తున్నారు.
రోగులకు సరైన సమయం కేటాయించాలి
మరోవైపు, ఆసుపత్రికి వచ్చే రోగులను వైద్యులు, సిబ్బంది సరిగా పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు కూడా వినిపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యతో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తికి ఓపికగా సమస్యను తెలుసుకుని, అవసరమైన పరీక్షలు చేసి, తగిన వైద్య సలహా ఇవ్వాల్సి ఉండగా.. తొందరపాటు సమాధానాలు, నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోందని కొందరు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏం చేసుకుంటారో చేసుకోండి.. ఎక్కడైనా చెప్పుకోండి వంటి మాటలు రోగులకు సమాధానంగా వినిపిస్తే.. ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతినే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.
పేదలకు వైద్యం అందించడమే ప్రభుత్వ ఆసుపత్రుల లక్ష్యం
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారిలో ఎక్కువమంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు చెందినవారే. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్య వ్యవస్థపై నమ్మకంతో వారు ఇక్కడికి వస్తుంటారు.










