కరీంనగర్ పరిధిలోని దుర్షేడ్ లో తిమ్మాపూర్ స్టేజి వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎం లో భారీ దొంగతనం జరిగింది. శనివారం రాత్రి స్కార్పియో వాహనంలో వచ్చిన దొంగలు గ్యాస్ కట్టర్ ఉపయోగించి ఏటీఎం మిషన్ ను కట్ చేసి అందులో ఉన్న డబ్బులను ఎత్తుకెళ్లారు.
ఆదివారం తెల్లవారుజామున స్థానికులు ఈ దొంగతనాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగలు ఎంత నగదును అపహరించుకెళ్లారనే విషయం ఇంకా తెలియాల్సి ఉందని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దొంగలు ఉపయోగించిన స్కార్పియో వాహనం నంబర్, సీసీటీవీ ఫుటేజీని సేకరించడంపై పోలీసులు దృష్టి సారించారు. బ్యాంకు అధికారుల నుంచి చోరీకి గురైన నగదు వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈ దొంగతనం వెనుక ఏమైనా ముఠా హస్తం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.











