అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ - ఎఫ్ఏసీ) మారోతు వెంకట సూర్య లోకేశ్వరరావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒక ఉద్యోగి నుంచి రూ. 50,000 లంచం తీసుకుంటుండగా ఆయన ఏసీబీ అధికారులకు చిక్కారు.
జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ - ఎఫ్ఏసీ) మారోతు వెంకట సూర్య లోకేశ్వరరావు, కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అమ్ము సూర్య చక్రవర్తికి సంబంధించిన జీతాల బకాయిలు, పెండింగ్ వార్షిక ఇంక్రిమెంట్లు, మరియు పే స్కేల్ రెగ్యులరైజేషన్ బిల్లులు ఆమోదించడానికి రూ. 50,000 లంచం డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్‌తో తీవ్ర మనోవేదనకు గురైన బాధితుడు ఏసీబీ విశాఖపట్నం రేంజ్ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో రంగంలోకి దిగారు.
లంచం స్వీకరిస్తుండగా అరెస్ట్
బుధవారం పాడేరు ఆర్డీవో కార్యాలయంలో, బాధితుడి నుంచి రూ. 50,000 నగదును లోకేశ్వరరావు లంచంగా స్వీకరిస్తుండగా ఏసీబీ బృందం అకస్మాత్తుగా దాడి చేసి పట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన చేతులకు నిర్వహించిన కెమికల్ టెస్ట్ (రసాయన పరీక్ష) పాజిటివ్‌గా తేలింది.
అధికారిక కార్యాలయంలోనే డీఆర్వో ఏసీబీకి జిల్లా రెవెన్యూ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.











