Palnadu/Gurazala (ధర్మ రథం) జూలై 21
అమాయక ప్రజలను, ముఖ్యంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని, దృష్టి మళ్లించి విలువైన బంగారు ఆభరణాలు అపహరిస్తున్న అంతర్జిల్లా దొంగల ముఠాను కోరుట్ల పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 24 గ్రాముల బంగారు గొలుసుతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల్లో ఒకరిపై 100కు పైగా కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
అమాయక ప్రజలను, ముఖ్యంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని, దృష్టి మళ్లించి విలువైన బంగారు ఆభరణాలు అపహరిస్తున్న అంతర్జిల్లా దొంగల ముఠాను కోరుట్ల పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి బంగారు గొలుసుతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులు సిద్దిపేట పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారిలో అల్లెపు కృష్ణ (51), కుంచెపు శ్రీకాంత్ (30), అల్లెపు రాజ్‌కుమార్ (28) ఉన్నారు.
సిద్దిపేట ప్రాంతంలో తమ నేర చరిత్ర గుర్తుపట్టే అవకాశం ఉండటంతో, ఇతర ప్రాంతాలలో వరుస దొంగతనాలు చేయాలనే ఉద్దేశంతో ఈ ముఠా కోరుట్లకు చేరుకుంది. గతేడాది జూలై 15న కోరుట్లకు వచ్చిన నిందితులు ఒక స్థానిక లాడ్జిలో బస చేశారు. మరుసటి రోజు (జూలై 16న) కోరుట్ల బస్టాండ్ పరిసరాల్లో సుమారు 70 ఏళ్ల వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్నారు.
వృద్ధురాలి వద్దకు వెళ్లిన నిందితులు ఆమెను పరిచయం చేసుకుని, ప్రభుత్వ పెన్షన్‌ను రూ.2,000 నుంచి రూ.4,000కు పెంచిస్తామని నమ్మబలికారు. అనంతరం ఆమెను కోరుట్లలోని ఎస్బీఐ బ్యాంకు సమీపానికి తీసుకెళ్లారు. బంగారు ఆభరణాలు ధరించి ఉంటే పెన్షన్ రాదని మాయమాటలు చెప్పి, ఆమె మెడలో ఉన్న లక్ష్మీదేవి బిళ్లల బంగారు గొలుసును తీయించుకున్నారు. పెన్షన్ ఫారాలు తీసుకువస్తామంటూ నమ్మించి ఆ గొలుసుతో అక్కడి నుంచి పరారయ్యారు.
మరిన్ని దొంగతనాలు చేయడానికి లాడ్జిలోనే వేచి చూస్తున్న నిందితులను కోరుట్ల పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 24 గ్రాముల బరువున్న లక్ష్మీదేవి బిళ్లల బంగారు గొలుసు, ఒక Realme మొబైల్ ఫోన్, ఒక Samsung మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ప్రధాన నిందితుడైన అల్లెపు కృష్ణపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఏకంగా 100కు పైగా కేసులు నమోదై ఉన్నట్లు తేలింది. మిగతా ఇద్దరు నిందితులపై కూడా పలు దొంగతనాల కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. చట్టపరమైన పంచనామా నిర్వహించి సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరిచేందుకు తదుపరి చర్యలు చేపట్టారు.
తెలియని వ్యక్తులు ప్రభుత్వ పథకాలు, పెన్షన్ పెంపు, బ్యాంకు పనులు లేదా ఇతర హామీల పేరుతో మాట్లాడితే అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ విలువైన బంగారు ఆభరణాలను అపరిచితులకు అప్పగించకూడదని కోరుట్ల పోలీసులు ప్రజలకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డైల్-112 కు సమాచారం అందించాలని కోరారు.











