బడంగి, 26 September
మహారాష్ట్ర రాష్ట్రాన్ని తీవ్ర కరువు పరిస్థితులు చుట్టుముట్టాయి. రాష్ట్రంలోని 358 తాలూకాలలో 265 తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ప్రకటించారు. ఇది రాష్ట్రంలో 75 శాతం ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది.
మహారాష్ట్ర రాష్ట్రాన్ని కరువు పీడిస్తోంది. రాష్ట్రంలోని 358 తాలూకాలలో 265 తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తిస్తూ సీఎం ఫడ్నవిస్ స్వయంగా ప్రకటించారు. అంటే 75 శాతం ప్రాంతాల్లో కరువు ఉందని, వ్యవసాయం లేదని స్పష్టం చేసిన సీఎం ఫడ్నవీస్, రైతులను ఆదుకునేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని వివరించారు.
ధారాశివ్, జిల్లాల్లో జూలై నుంచి వర్షాలు పడలేదని, ఈ క్రమంలోనే రైతులు పంటల సాగు చేపట్టలేదని, రైతులు, రైతు కూలీల రోజువారీ జీవనం దెబ్బతిన్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఛత్రపతి సంభాజీనగర్ డివిజన్లో 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. పూణె, నాసిక్ డివిజన్లలో 30 శాతం, నాగ్పూర్ డివిజన్లో 27 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అమరావతి, సోలాపూర్, లాతూర్ సహా ఆరు జిల్లాల్లో ఏకంగా 50 శాతం లోటు వర్షపాతం నమోదవడంతో, ఆ ఆరు జిల్లాల్లో కరువు భీకరంగా ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోంది.
మహారాష్ట్రలో ఖరీఫ్ సీజన్లో సోయాబీన్, పత్తి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములు వంటి పంటలను పండిస్తారు. వర్షాలు లేకపోవడంతో ఈసారి సాగు విస్తీర్ణం 50 శాతం దాటలేదని, సాగు చేసిన పంటలకు తెగుళ్ల బెడద తీవ్రంగా ఉండటంతో రైతులు దారుణంగా నష్టపోయినట్లు ఈ నివేదిక వెల్లడిస్తోంది.
ఇప్పటికే మహారాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిరసనలకు దిగుతున్నారు. పంట నష్టం, కరువు సాయం ప్రకటించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం, కరువు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పంటలు సాగుచేయని రైతులు, రైతు కూలీలకు నగదు సాయం చేయాలని అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.












