ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చిరుమర్రి చెరువు వద్ద రూ. 2.90 కోట్లతో పర్యాటక వసతుల కల్పనకు, అలాగే రూ. 40 లక్షలతో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు.
చిరుమర్రి చెరువును ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, జిల్లాలో పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా చెరువును సుందరీకరిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం వైఏటీ సి శాఖ ద్వారా రూ. 2.90 కోట్ల పరిపాలనా అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. నిర్ణీత ఆరు నెలల గడువులోగా పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ పర్యాటకుల సౌకర్యార్థం రెండు ఫుడ్ కియోస్క్‌లు, విశ్రాంతి కోసం గెజిబోలు, ఆధునిక టాయిలెట్ బ్లాక్, మెరుగైన విద్యుద్దీకరణ, ల్యాండ్‌స్కేప్, హార్డ్స్కేప్ తోటలు, నడక దారులు, విశాలమైన పార్కింగ్ వసతులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ముదిగొండ మండల కేంద్రంలో గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో రూ. 40 లక్షల వ్యయంతో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి కూడా డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలకు ఆధునిక వసతులతో కూడిన సమాచారాన్ని అందించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. ఈ గ్రంథాలయ భవన నిర్మాణం వేగవంతంగా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత ఈ గ్రంథాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ముదిగొండ మండలంలోని వనంవారి కృష్టపురం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 20 లక్షలతో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి కూడా డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సుడా చైర్మన్ దుర్గాప్రసాద్, విద్యుత్ శాఖ ఎస్ఇ శ్రీనివాసా చారి, ఆర్ అండ్ బి ఎస్ఇ యుగంధర్ రావు, పీఆర్ ఎస్ఇ వెంకట్ రెడ్డి, సిపిఓ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.












