విద్యార్థులు చెడు మార్గాలకు దూరంగా ఉండి, స్వయం నియంత్రణతో ఉన్నత మార్గంలో నడిస్తేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వి సోమిరెడ్డి అన్నారు. మధిర కిష్టాపురం లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులంలో మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
సోమవారం జరిగిన ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు తమకు నచ్చిన ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. తమ గ్రామాలకు తిరిగి వెళ్ళినప్పుడు, మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి, వారిని సక్రమ మార్గంలోకి తీసుకురావడానికి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. తల్లిదండ్రులకు, బంధువులకు, తోటివారికి మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని తెలిపారు.
మత్తు పదార్థాలు మనిషిని సమాజంలో క్షీణతకు గురిచేస్తాయని, నియంత్రణ కోల్పోయిన వ్యక్తి సమాజంలో గౌరవం కోల్పోతాడని అన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకమని, చదువుతో పాటు సమాజ నిర్మాణం, పరిసరాల శుభ్రతపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఇతరుల నియంత్రణలో కాకుండా, స్వయం నియంత్రణ, స్వయం శక్తితో ఉత్తమ పౌరులుగా ఎదగడానికి ప్రయత్నించాలని, అవసరమైనప్పుడు ఉపాధ్యాయుల సహాయం తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
అధికారుల సూచనలు
ఈ కార్యక్రమంలో మధిర ఎక్సైజ్ సీఐ బాలకిషన్ కూడా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మత్తు పదార్థాలు మనిషిని బానిసగా మార్చి, ఉజ్వల భవిష్యత్తుకు ఆటంకం కలిగిస్తాయని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఐనాల సైదులు, ఎక్సైజ్ సీఐ బాలకిషన్, జేవిపి సంజీవరావు, సీనియర్ అధ్యాపకులు కొక్కిరేణి సత్యం, నాగేశ్వరరావు, రామయ్య, ఉపాధ్యాయులు సామ్సన్, రేణుక, రాధిక, శరత్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు.












