మండలం మహదేవపురం లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న దేవరకొండ వెంకటేశ్వరరావుపై జిల్లా విద్యాశాఖాధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు, పొద్దస్తమానం సొంత పనులతో కాలక్షేపం చేస్తున్నారని, బడి వేళల్లో బయట కాలక్షేపం చేస్తున్నారని గ్రామస్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
లక్షల్లో జీతం తీసుకుంటూ పేద విద్యార్థులకు న్యాయం చేయాల్సిన సీనియర్ ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు ఏ రోజు కూడా సక్రమంగా పాఠాలు చెప్పడం లేదని, ఏ క్లాస్ లో కూడా సిలబస్ పూర్తి చేయలేదని విద్యార్థులు వాపోతున్నారు. పాఠశాలకు సమయానికి కూడా రాకుండా, వచ్చినా కూడా తరచుగా బయటకు వెళ్లిపోతున్నారని, స్కూల్ కి వచ్చిన దగ్గర నుండి ఫోన్ లో మాట్లాడుతూ టైం పాస్ చేస్తున్నారని తెలిపారు.
సదరు ఉపాధ్యాయుని ప్రవర్తనతో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా సదరు ఉపాధ్యాయుని విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు పేర్కొన్నారు.
సదరు ఉపాధ్యాయుని విషయంపై గతంలో కూడా హెచ్ఎంకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, అందుకే జిల్లా విద్యాశాఖాధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సదరు ఉపాధ్యాయుడు తన ప్రవర్తన మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.












