తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న తైమామన్ తంగ మోతిరమ్ తిట్టమ్ (మేనమామ బంగారు ఉంగరం) పథకం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 28న మదురై రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి విజయ్ ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
తొలుత ఈ కార్యక్రమాన్ని ఉసిలంపట్టిలో నిర్వహించాలని భావించినప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా వేదికను మదురైకి మార్చినట్లు అధికారులు వెల్లడించారు. తమిళ సంప్రదాయం ప్రకారం మేనమామ తన మేనకోడలు లేదా మేనల్లుడికి పుట్టినప్పుడు బంగారు కానుక ఇవ్వడం ఆచారం. అదే సెంటిమెంట్‌ను గౌరవిస్తూ ప్రభుత్వమే మేనమామ స్థానంలో నిలిచి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే పసిపిల్లలకు 1 గ్రాము బరువు, 22 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు ఉలాన్ని (ఉంగరాన్ని) కానుకగా అందించనుంది.
పథకం వివరాలు
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో () జన్మించిన శిశువులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన పసికందులకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సీఎం విజయ్ స్వయంగా 50 మంది పసిపిల్లలకు బంగారు ఉంగరాలను పంపిణీ చేస్తారు.
తొలి విడత పంపిణీ కోసం ప్రభుత్వం ఇప్పటికే 1.28 లక్షల బంగారు ఉంగరాలను సిద్ధం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, మాతాశిశు సంరక్షణను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సరికొత్త పథకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.












