జిల్లా, మండల స్థాయి ఉత్తమ భాషోపాధ్యాయ అవార్డులు పొందిన హిందీ ఉపాధ్యాయులకు రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్.యు.పి.పి.టి.ఎస్) ఆధ్వర్యంలో లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు భగవద్గీతలను బహుమతిగా అందజేశారు.
మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశం ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు చెరుకు మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో భాగంగా, విరామ సమయంలో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. హిందీ సబ్జెక్టులో జిల్లా స్థాయి అవార్డులు పొందిన జాదవ్ వసంతరావు, తిరుకోవెల నారాయణలకు, మండల స్థాయి అవార్డులు పొందిన మ్యాకల శంకరయ్య, శీలలం పద్మజ, వడ్లకొండ ధనలక్ష్మి, షాజిద్ రిహానాలకు ఆర్.యు.పి.పి.టి.ఎస్ జగిత్యాల జిల్లా, మండల శాఖల పక్షాన జిల్లా అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, మండల అధ్యక్షులు మోర నరహరి, కాంప్లెక్స్ హిందీ భాషోపాధ్యాయులు ఘనంగా శాలువాలతో సత్కరించి, భగవద్గీతలను అందజేశారు.
ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడిన వక్తలు, భవిష్యత్తులో రాష్ట్ర, జిల్లా స్థాయిలో మరిన్ని అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. జాతీయ భాష అయిన హిందీ అభివృద్ధికి దోహదపడాలని, జాతీయ భాష జాతీయ భావాలను పెంపొందిస్తుందని, హిందీ ఉపాధ్యాయులు ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. దేశంలో ఉన్న వారందరూ ఈ భూమి నా తల్లి, నేను భూమి పుత్రుడను అనే భావనతో మాతృభూమి పట్ల దేశభక్తి కలిగి ఉండాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ యం.డి సయీద్ పాషా, మేన్నేని నీలిమ, రాపర్తి నర్సయ్య, బొంగోని మల్లయ్య, రంగు రమేష్, ఆర్.నగేష్, ఎ.గంగాధర్, రాజేశం, కె. యశోద, గోసికొండ సుజాత, మాదాసు రమ, బి.రాధ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.












