చివ్వెంల మండలాన్ని కరువుమండలంగా ప్రకటించాలని గ్రామీణ పేదల సంఘం సూర్యాపేటజిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య డిమాండ్ చేశారు. మండలంలోని మొగ్గయ్య గూడెం, భీమ్లాతండా, చందుపట్ల గ్రామాలలో ఎండిపోయిన పంట పొలాలను సంఘం నాయకులు పరిశీలించారు.
సూర్యాపేట ప్రాంతంలో గత మూడు నెలలుగా ఎల్నినో ప్రభావం వల్ల సరైన వర్షాలు కురవకపోవడంతో చెరువులు, కుంటలు, బోరుబావులు ఎండిపోయాయని వీరభద్రయ్య తెలిపారు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో తాగునీరు, సాగునీటి కొరత తీవ్రంగా ఏర్పడింది.
జూలై నెలలో కురిసిన అరకొర వర్షాలను నమ్ముకుని రైతులు పత్తి, పెసర, కంది తదితర పంటలను సాగు చేశారు. అయితే, తదుపరి వర్షాలు పూర్తిగా లేకపోవడంతో ఆ పంటలు ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నష్టపరిహారం డిమాండ్
ఎండిపోయిన పంటలకు ప్రతి రైతుకు ఎకరానికి రూ.50వేల పంట నష్టపరిహారం అందించాలని గ్రామీణ పేదల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్యతో పాటు భాషీపంగు సునీల్, అనంతుల ఎల్లయ్య, అంజయ్య నారాయణ రెడ్డి, షేక్ సైదులు, ధరావత్ వీరన్న, కట్టంగూరు వెంకటరావు, పంతం భ్రమణాచారి, భూక్య వెంకన్న, భూక్య చక్రం, భూక్య పెద్దవల్యా, సిగ వెంకన్న, చిన్నవల్యా తదితరులు పాల్గొన్నారు.












